గత వారం ఓ సరదా ప్రయాణం.. !!!

2011/02/27

పెళ్ళిళ్ళ సీజన్ కావడం తో మా కుటుంబంతా కలిసి మా ఊరి దగ్గర్లో ఉన్న బంధువుల పెళ్ళికి వెళ్ళి అటునుండి మా ఊరెళ్ళాం. కళ్ళొ తో పళ్ళె అందాలు, చేతిలో కెమెరా .. కట్ చేస్తే ఇక్కడ కొన్ని చిత్రాలు…!

 

మా కులానికి నిషా.. బ్రతకడానికి ఓ చిగురాశ..!

ఇదే మా పొలం – సస్యశ్యామలం..

క్వాలిస్ కి కాస్త రిలాక్స్..

ఈ రెండు జడల బొమ్మ.. మా చిన్ని కోడలమ్మ..

సాయంకాల సమయానా గట్టు పై తాటి చెట్టు

మబ్బులు కమ్మే వేళ మనుసులో మిల మిల..


ఈ బుల్లి బుల్లోడు.. మా అన్నయ్య పిల్లోడు..

 

కెమెరా, ఆక్షన్, కట్.. ఫటా ఫట్

అలసిన నాకు కల్లు తొ థ్రిల్లు ..!!

————————————————————————————————-

 

 

ప్రకటనలు

ఈసారైన వరించేనా వరల్డ్ కప్?

2011/02/27

ప్రతి ఒకరిలో ఏదో ఒకరకమైన పిచ్చి దాగుంటుంది. ఎక్కడ ఏ ముగ్గురు కలుసుకున్న ఆ ముగ్గురికి ముగ్గురు ఖచ్చితంగా క్రికెట్ గురించో, సినిమాల గురించో లేదా రాజకీయాల గురించో తప్పక మాట్లాడుకుంటారు.  అలా మన దేశంలో క్రికెట్ పిచ్చి ఉన్న ప్రముఖుల జాబితాలో నా పేరు సుస్థిరం. ఆడటానికైన, ఆస్వాదించడానికైనా. ఇంట్లో ఆడే క్రికెట్ నుండి ఇంటర్ నేషనల్ లెవెల్ క్రికెట్ వరకు మరి.. :)

క్రికెట్ లొ.. అందునా ప్రపంచ కప్ అంటే మరీనూ!  టి.వి కి అలా అతుక్కుఫోతానంతే..క్రికెట్ పై ఉన్న పిచ్చితో వరల్డ్ కప్ కి సంభందించిన హిస్టరి, వివరాలు, గణాంకాలు తెలుసుకోగలిగాను.. 1975 & 1979 వరుసగా వెస్టిండీస్; ఆ తర్వాత 1983 లొ ఇండియా; 1987 లో ఆస్ట్రేలియా; 1992 లో పాకిస్తాన్ గెలుచుకున్నాయట. 1975 నుండి ప్రపంచ కప్ మొదలయినా నాకు క్రికెట్ అంటె ఓ మాదిరి షోకు, పరవశం, ప్రేమ, దోమ, పిచ్చి మొదలైనా వరల్డ్ కప్ మాత్రం 1996.  “ఇండియా మొదటిసారి ప్రపంచకప్ 1983 లొ గెలిచింది” అని నాకు 1996 లోనే తెలిసింది ఎందుకంటే ఇండియా ప్రపంచ కప్ కైవసం చేసుకున్నప్పుడే నేను ఈ బాహ్య ప్రపంచంలోకి ఊడి పడ్డాను.

1996 ప్రపంచ కప్: అప్పట్లొ మాకు టి.వి లేదు. మా ఇంటికి దగ్గర్లో ఓక పాలిటెక్నిక్ హాస్టెల్ ఉండేది.. ఇండియా మ్యాచ్ లు ఉన్న ప్రతి రోజు ఆ హాస్టెల్ ఉన్న హాల్ లో కళాశాల లో ఉన్న విద్యార్దులతో పాటు నేను సాటి విద్యార్ది గా (ష్..) ఇండియా ఆడే మ్యాచులు తిలకించేవాడిని.. నా అదృష్టం బాగుండి ఆ కాలేజ్ వార్డెన్ కంటపడలేదు. ఉపఖండం లో జరిగిన ఈ వరల్డ్ కప్ లో సెమిస్ వరకు చేరిన ఫేవరేట్ ఇండియా ఆ తర్వాత శ్రీ లంక చేతిలో ఘోర పరాజయం పాలైంది. కాస్త నిరాశ చెందిన దానికి ముందు పాకిస్తాన్ పై గెలిచాం కదా అనే ఫీలింగ్ తో సర్దుకున్నాను. అప్పుడే తెలిసింది వరల్డ్ కప్ లో ఎప్పుడూ పాకిస్తాన్ పై ఇండియా దే పై చేయి అని. ఇక ఈ కప్ శ్రీలంక మొదటిసారిగా గెలుచుకుంది.

1999 ప్రపంచ కప్: ఈ కప్ కి కూడా చూడ్డానికి ఇంట్లో టి.వి. లేదు.. పాల వ్యాపారం చేసేవాళ్ళం కనుకు మా కస్టమర్స్ ఇంటికి పాల బాటిల్ డెలివర్ చేయడానికి వెళ్ళి అక్కడే ఇండియా ఆడే మ్యాచులు చూసేవాడిని. అలా వీలు కానప్పుడు దగ్గర్లో ఉన్న ఇరాని కేఫ్ లొ ఒంటరి గానే చూసేవాడిని. వెయిటెర్ ఏం కావాలి అని అస్తమానం విసిగిస్తుంటే ఒక సింగిల్ టీ ఆర్డర్ చేసాను. నాలాంటి శాల్తీ అనుకుంటా నాకు ఎదురుగా టేబుల్ కి అటు వైపు కూర్చున్నాడు. వైటెర్ తను నా ఫ్రెండేమో అనుకొని బై-టూ టీ తెచ్చాడు.. సింగిల్ గా ఉన్న నాతో మింగిల్ అవడానికి(పాకేట్ మని కూడ సరిగ లేకుండే నాకు!) టీ లాగించేసాడు.. తనే బిల్ పే చేసాడు.. తనకు క్రికెట్ అంటే పిచ్చని తెలిసింది.  అలా విచిత్ర పరిచయం కాస్తా స్నేహం గా మరింది.. తన పేరు ప్రభాకర్. ఇప్పటికి టచ్ లో ఉన్నాడు.. :) మళ్ళి ఫేవరేట్ గా ఉన్న ఇండియా  ఈ వరల్డ్ కప్ లో సెమిస్ కి కూడా చేరుకోకఫొవడం బాధాకరం! కప్ ఆస్ట్రేలియా ఎగరవేసుకుపోయింది..

2003  ప్రపంచ కప్: ఈ కప్ కి మా ఇంట్లోనే బ్లాక్ & వైట్ టి.వి లో చూసే అదృష్టం దొరికింది. మా అక్క వాళ్ళు కలర్ టి.వి కొనడం తొ అది మాఇంటికి చేరింది. కేవలం క్రికెట్ మ్యాచులున్నప్పుడు మాత్రమే (దూరదర్శన్) దానిని ఎక్కడో సజ్జ పై నుండి కిందికి తెచ్చి దాన్ని ఆన్ చేసేవాళ్ళం. చూసి తరించేవాళ్ళం.. మా ఇంట్లొ నాతో పాటు మా అన్నకు, తమ్ముడికి కూడా క్రికెట్ అంటే పిచ్చ పిచ్చే! మళ్ళి ఫేవరేట్ గా ఉన్న ఇండియా ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయింది.. ఇంకేముంది ఆస్ట్రేలియాదే హవా..!

2007  ప్రపంచ కప్: చూడ్డానికి డొక్కు బ్లాక్ & వైట్  ఉన్నా.. ఈ కప్ లో మన వాళ్ళ పరిస్థితి మరి దారుణం. లీగ్ లో నే టొర్నీ నుండి నిష్క్రమించింది..  పెద్దగా ఇండియా మ్యాచులు చూసే అదృష్టం దక్కలేదు.  పసి కూనలు బంగ్లా చేతిలో ఓడిపోవటం భారత్ కు పరాకాష్ట.. ఇంకేముంది ఆస్ట్రేలియా వరుసగా మూడోసారి, టొటల్ గా నాలుగోసారి వరల్డ్ కప్ టైటిల్ చేజిచ్చుకుంది.

ప్రస్తుత 2011  ప్రపంచ కప్: ప్రపంచ కప్ క్రికెట్ పరంపరలో 10వది. సచిన్ కి ఆరోవ వరల్డ్ కప్ సిరిస్. ఉపఖండం లో జరుగుతుంది.. మళ్ళి ఇండియా ఫేవరేట్ గా ఉంది..గెలుస్తుందని ఆశిద్దాం..!!

అన్నట్లు ఇప్పుడు మా ఇంట్లో కలర్ టి.వి ఉంది.. ఎయిర్ టెల్ డి.టి.హెచ్ కనెక్షన్ సుమీ.. :)