కళ్యాణాల జోరు…తప్పదిక హాజరు!

2012/02/05

ప్రతి మనిషి జీవితం లో ఒక అపురూపమైన ఘట్టం వివాహం. ఈ 2012 సంవత్సరం యుగాంతరం అనే భ్రమో సుముహుర్తాలు ఎక్కువగా లేవన్న నిజమో మరే ఇతర కారణాలో తెలీదు కాని నాకు తెలిసిన బ్రహ్మచారులు, బ్రహ్మచారిణిలు సాఫీ జీవితం లోనుండి సంసార జీవితం లోకి పరుగులేస్తున్నారు. అందునా ఈ ఫిబ్రవరి మాసంలో మరీను..! ఎక్కువగా వారాంతపు ముహుర్తాలు చూసే మా మిత్రులు కళ్యాణవేదికలు అందుబాటులో లేక ఆయా తేదిలో ముహూర్తములు కుదరక ఏకంగా నడివారంలో లాగించేస్తున్నారు.

గమ్మతైన విషయం ఏంటంటే గత కొన్నాళ్లుగా జాతకాలు కలవకో, అమ్మాయిలు నచ్చకో  ఈడెక్కువై ఇంకా  ఎదురుచూస్తున్న మా బ్యాచిలర్ బాబులను సైతం ఈ సంవత్సరం కళ్యాణ ఘడియలు రయ్ రమ్మంటూ పలకరిస్తున్నాయ్. ఇంటికి కూసింత దగ్గరలో ఉన్న కర్మాన్ ఘాట్, చంపాపేట్ తదితర ప్రాంతాల్లో సుమారు ఒక వంద ఫంక్షన్ హాళ్ళు కళ్యాణ శోభలతో దేదిప్యామానంగా వెలిగిపోతున్నాయ్.

ఈ పాటికి మీ ఇంట్లో  ఆహ్వాన పత్రికలు మిమ్మల్ని గుర్తుకు చేస్తుంటాయి. మన బంధువులో,  మిత్రులో,  సహోద్యుగులో ఎవరో ఒకరి పెళ్లికి మనం తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒక రోజు ఒక పెళ్ళికి వెళ్ళాలంటే చక్కగా ప్లాన్ చేసుకుంటాం. కాని ఒకే రోజు ఒకే ముహూర్తానికి రెండు మూడు పెళ్ళిళ్ళు అది కాక ఒకటి హైదరాబాదులో ఇంకోటి వైజాగులో మరొకటి కాకినాడలో ఉండి అవి కూడా తప్పక హాజారు కావాల్సిన వేడుకలైతే ఇంకేముంది నా బుర్ర సతమతవుతుంది. ప్రస్తుతం తొమ్మిది, పది, పదకొండు తేదిల్లో ఓ అరడజను పెళ్ళిళ్ళు, మూడు ఎంగేజ్మెంట్ లు రెండు మాటముచ్చట్లకు వేర్వేరు ప్రదేశాల్లో హాజరు కావాల్సింది. ఎంత సవ్యంగా ప్లాన్ చేసుకోవాలో నాకైతె అర్ధం కావట్లేదు.

ఏ శుభకార్యానికైన ఆలోచిస్తానేమో కాని కళ్యాణ వేడుకలకు మాత్రం నా హాజరు పక్కగా పడాల్సిందే. కుదరని పక్షంలో ముందు రోజో, తర్వాత రోజో వధూవరులని కలవడానికి ప్రయత్నిస్తాను. ఈ సందర్భంగా వివాహా బంధంలోకి అడుగు పెడుతున్న నా శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా బ్లాగ్మిత్రులకు వివాహ మహోత్సవ శుబాకాంక్షలు…!

ప్రకటనలు